Tuesday 23 October 2012

Fundamental Rights and Its Explanation

ప్రాథమిక హక్కులు వివరణ

భారత రాజ్యాంగంలోని మూడవ అధ్యాయం ( 12 నుంచి 35 ప్రకరణలు ) మొత్తం 24 ప్రకరణలు ప్రాథమిక హక్కులను ప్రస్తావిస్తుంది. 1978, 44వ రాజ్యంగ సవరణలో ఆస్తి హక్కును (31 వ ప్రకరణ ) ప్రాథమిక హక్కుల అధ్యాయం నుంచి తొలగించిన తరవాత, ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవి :

  1. సమానత్వ హక్కు ( 14 నుంచి 18వ ప్రకరణ వరకు )

  2. స్వేచ్ఛా హక్కు ( 19 నుంచి 22వ ప్రకరణ వరకు )

  3. పీడన నిరోధక హక్కు ( 23 , 24 ప్రకరణలు )

  4. మత స్వేచ్ఛ హక్కు ( 25 నుంచి 28వ ప్రకరణ వరకు )

  5. విద్యా, సాంస్కృతిక హక్కులు ( 29, 30 ప్రకరణలు )

  6. రాజ్యాంగ పరిరక్షణ హక్కు ( 32వ ప్రకరణ )


ప్రాథమిక హక్కులపై ప్రత్యేకంగా పేర్కొనబడిన ప్రకరణలు 14 నుంచి 32. తొలగించిన 31వ ప్రకరణను మినహాయిస్తే 18 ప్రకరణలలో ప్రాథమిక హక్కుల వర్గీకరణ ఉంది. అయితే మూడవ భాగంలోని ప్రాథమిక హక్కుల అధ్యాయంలో ఇంకా మరికొన్ని ప్రకరణలున్నాయని గుర్తించాలి. అవి 12, 13, 33, 34, 35 ప్రకరణలు. ఈ ప్రకరణలో ప్రాథమిక హక్కుల వర్గీకరణ లేకపోయినప్పటికీ వాటికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. వీటిని “ సాధారణా౦శాలు ” అని ఎం.వి.ఫైలీ పేర్కొన్నారు. ప్రాథమిక హక్కుల వర్గీకరణను తెలుసుకునే ముందు ఈ “ సాధారణా౦శాల ” లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం.

12వ ప్రకరణ

ప్రాథమిక హక్కుల అధ్యాయమైన మూడవ భాగంలోని 12వ ప్రకరణ ఎంతో ప్రముఖమైనది. ఈ ప్రకరణతోనే మూడవభాగం ప్రారంభమవుతుంది. ప్రాథమిక హక్కులలో అనేక చోట్ల State ( రాజ్యం) అనే పదం పేర్కొనడం జరిగింది. 12వ ప్రకరణలో ఈ State అనే పదానికి “ నిర్వచనం” ఇవ్వబడింది.


ఈ నిర్వచనం ప్రకారం :

        “ ఈ భాగంలో, ఇతర విధంగా అవసరమైతే తప్ప, “ రాజ్యం ” లో భారత ప్రభుత్వం పార్లమెంట్, ప్రతిరాష్ట్రంలోని రాష్ట్రప్రభుత్వం, శాసనసభ, భారత భూభాగంలోని లేదా భారతప్రభుత్వ ఆధిపత్యంలోని సమస్త స్థానిక లేదా ఇతర అధికార వ్యవస్థలుంటాయి.

పై నిర్వచనాన్ని పరిశీలిస్తే రాజ్యం అంటే

(1)   కేంద్ర శాసనసభ   (2) కేంద్ర కార్యనిర్వాహక వర్గం   (3) రాష్ట్ర శాసనసభ   (4) రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం   (5) స్థానిక లేదా ఇతర అధికార వ్యవస్థలు.

మునిసిపల్ కార్పోరేషన్, పంచాయత్ సమితి వంటి స్థానిక పరిపాలనా సంస్థలు “ రాజ్యం ” పరిధిలో వస్తాయని సోమ్ ప్రకాశ్ Vs కేంద్రప్రభుత్వం, గులాం Vs ఉత్తరప్రదేశ్ లో సుప్రీంకోర్టు వివరించింది. “ఇతర అధికార వ్యవస్థలు (Other Authorities) అంటే ఏమిటో రాజ్యాంగంలో ప్రత్యేకంగా పేర్కొనలేదు. న్యాయస్థానాలు దీనిపై అనేక వ్యాఖ్యానాలు చేశాయి. కొచ్చినీ Vs మద్రాస్ కేసులో న్యాయస్థానం తీర్పు ప్రకారం “శాసనాలను జారీ చేయగల అధికారి లేదా అధికార గణం “రాజ్యం” పరిధిలో ఉండవచ్చు. అధికార వ్యవస్థ ద్వారా ఆదేశించే లేదా సహాయం పొందే ప్రైవేట్ కార్యం కూడా “రాజ్యం” పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం న్యాయస్థానాల తీర్పుల ద్వారా “రాజ్యం” పరిధిని చాలా వరకు విస్తరించారు. ఇప్పుడు “రాజ్యం” పరిధిలో ప్రభుత్వ కంపెనీలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, యూనివర్సిటీలు తదితర సంస్థలు వస్తాయి. అయితే ఈ మధ్య  జీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ Vs భారత ప్రభుత్వం *(* AIR 2005 SC 2677), భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ‘రాజ్యం’ పరిధిలోని ‘ఇతర అధికార వ్యవస్థలలో’ రాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనికి కారణం బిసిసిఐని ప్రభుత్వం ఆర్థికంగా కానీ, వ్యవహారపరంగా కానీ పాలనాపరంగా కానీ పూర్తిగా నియంత్రించే స్థానంలో లేకపోవడమే.

పై నిర్వచనంలో “న్యాయశాఖ” “రాజ్యం” పరిధిలో లేదు. అయితే ఈ మధ్య వచ్చిన కొన్ని న్యాయస్థానాల తీర్పుల ప్రకారం న్యాయశాఖ నిర్వహించే కార్యనిర్వహక విధులు “రాజ్యం” పరిధిలోకి వస్తాయి. మొత్తం మీద ప్రాథమిక హక్కుల అధ్యాయంలో న్యాయపరమైన విధులలో న్యాయశాఖ ‘రాజ్యం’ పరిధిలో లేదని చెప్పవచ్చు. ఇటువంటి అకరణం (Omission) న్యాయస్థానాల నిరంకుశత్వానికి (Judicial Despotism) కి దారితీస్తుందని అభిప్రాయపడవచ్చు. అయితే, ప్రాథమిక హక్కుల రక్షణకు, ధర్మరక్షణకు న్యాయస్థానాలపై మనం విశ్వాసం చూపాలని కె.వి. రామం అభిప్రాయపడ్డారు.

13వ ప్రకరణ

        ప్రాథమిక హక్కుల రక్షణలో 13వ ప్రకరణ ఎంతో ప్రముఖమై౦ది. రాజ్యాంగానికి వ్యతిరేకమైన శాసనాలను కొట్టివేసే అధికారాన్ని ఈ ప్రకరణ న్యాయస్థానాలకు కలగజేస్తుంది. ఈ ప్రకరణలో రెండు ముఖ్యాంశాలున్నాయి. “రాజ్యాంగం” అమలులోకి రాక ముందున్న ఏ చట్టాలైనా ప్రాథమిక హక్కులకు అనుగుణంగా లేకపోతే అవి చెల్లవని 13(1) ప్రకరణ పేర్కొంటుంది. ‘ప్రాథమిక హక్కులను’ భంగపరిచే ఏ చట్టాన్ని కూడా రాజ్యం చేయరాదని, ఒకవేళ చేసినా ఆ చట్టం చెల్లదని 13(2) ప్రకరణ పేర్కొంటుంది. ఆర్డినెన్సులు, ఉత్తర్వులు, ఉపశాసనాలు, నిబంధనలు మొదలగు అంశాలను చట్టాలుగా భావించవచ్చని 13(3) ప్రకరణ పేర్కొంటుంది. అయితే ‘చట్టం’ అనే ఈ రాజ్యంగ పదం అనేక వ్యాఖ్యానాలకు గురయింది. ఈ కారణంగా 13(4) ప్రకరణలో 368 ప్రకరణ ద్వారా జరిగే రాజ్యంగ సవరణ ‘చట్టం’ పరిధిలో రాదని 1971లో ఆమోదించిన 24వ రాజ్యంగ సవరణ పేర్కొంటుంది. కానీ కేశవానంద భారతి కేసు (1973) తీర్పు ప్రకారం పార్లమెంటుకు ప్రాధమిక హక్కులను సవరించే అధికారం ఉన్నపటికీ, ఆ సవరణ రాజ్యంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉండరాదని చారిత్రాత్మక తీర్పు చెప్పింది.

33వ ప్రకరణ

        సాయుధ దళాలలోని సభ్యులకు, శాంతిభద్రతలు కాపాడవలసిన అధికార వర్గాలకు, రహస్య సమాచార సంస్థలలో పనిచేసే అధికారులకు, వీరితో సంబంధం కలిగిన సమాచార వ్యవస్థలలోని సభ్యులకు పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను కలగజేయాలని 33వ ప్రకరణ పేర్కొంటుంది. ఈ వర్గాలకు క్రమశిక్షణ, విధులలో నిబద్ధత కలగజేయడం కోసం పరిమితమైన ప్రాథమిక హక్కులను పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా గుర్తించడం రాజ్య సమగ్రతకు, సార్వభౌమాధికారానికి అవసరం.

34వ ప్రకరణ

దేశంలోని ఏ ప్రాంతం/ ప్రాంతాలలోనైనా సైనిక శాసనం అమలులో ఆ ప్రాంతం/ ప్రాంతాలలో ప్రాథమిక హక్కులపై విధించవలసిన ఆంక్షల గురించి 34వ ప్రకరణ వివరిస్తుంది. శాసనరీత్యా స్థాపితమైన కార్యవిధానం అనుసరించకుండా వ్యక్తి ప్రాణానికి, స్వేచ్ఛకు రక్షణ హక్కును హరి౦చకూడదు ( 21వ ప్రకరణ ). అయితే తిరుగుబాటు, దొమ్మి వంటి హింసాయుత పరిస్థితులలో క్రమశిక్షణా రాహిత్యం ఏర్పడ్డప్పుడు శాంతి భద్రతలు కాపాడటానికి ప్రత్యేక పరిస్థితులలో సైనికపాలన  విధించినప్పుడు సైన్యాధికారి జారీచేసే అధికార ప్రకటనలను శాసనరీత్యా స్థాపితమైన కార్య విధానమని భావించవచ్చు. సైనిక పాలన ఉన్న ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపనకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఈ వ్యవహారంతో సంబంధించిన ఏ వ్యక్తికైనా అవసరమైన చట్టాలను పార్లమెంట్ చేయవచ్చని 34వ ప్రకరణ తెలుపుతుంది. అయితే భారత రాజ్యాంగంలో సైనికపాలన విధించడానికి నిబంధనలు లేవు. హెబియస్ కార్పస్ సైనిక పాలనలో రద్దుకాదని జబల్ పూర్ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

35వ ప్రకరణ  

రాజ్యాంగం అభిలషించే ఏక పౌరసత్వాన్ని, జాతీయ ఐక్యతను కలగచేయడంకోసం కొన్ని ప్రత్యేక విషయాలలో పార్లమెంట్ కు మాత్రమే కొన్ని ప్రాథమిక వ్యవహారంలో ప్రత్యేకమైన అధికారాన్ని 35వ ప్రకరణ కలగజేస్తుంది. ఈ ప్రకరణ ప్రకారం 16(3), 32(3), 33, 34 ప్రకరణా౦శాలపై రాష్ట్ర శాసన సభలకు చట్టం చేసే అధికారం లేదు. వాటిపై చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కు మాత్రమే ఉంది. ఈ విధంగా కొన్ని ప్రాథమిక హక్కుల అంశాలపై రాష్ట్ర శాసనసభలకు అధికారం ఇవ్వకపోవడంలో ప్రధానవిషయం “దేశం మొత్తంలో ఏకరూపత కలగచేయడం ” అని ఆచార్య పైలీ అభిప్రాయపడ్డారు.

12, 13, 33, 34, 35 ప్రకరణలను మనం సాధారణా౦శాలుగా పేర్కొన్నాం. ఈ ఐదు ప్రకరణలలో ప్రాథమిక హక్కుల వర్గీకరణ లేదు. మూడవ అధ్యాయంలో మిగిలిన ప్రకరణలు 14 నుంచి 32. ఈ ప్రకరణలలో ప్రాథమిక హక్కుల వర్గీకరణ జరిగింది. ఈ వర్గీకరణలో వివిధ ప్రాథమిక హక్కులు ఉన్నాయి. వీటి గురించి రేపు తెలుసుకుందాం.

No comments:

Post a Comment