భారత రాజ్యాంగ సభ సలహాదారు బి.ఎన్.రావు రూపొందించిన ముసాయిదా ప్రకారం భారత రాజ్యాంగంలో రెండు రకాల హక్కులున్నాయి. వాటిని ప్రాథమిక హక్కులు (Fundamental Rights) గా, రాజ్యవిధాన ఆధేశ సూత్రాలు (Directive Principles of State Policy) గా పేర్కొనడం జరిగింది. భారత రాజ్యాంగ రచనను ఒక సామాజిక విప్లవంగా వర్ణించిన గ్రాన్విల్ ఆస్టిన్ ఈ రెండు రకాల హక్కులు భారతదేశంలో స్వేచ్ఛాయుత సామాజిక వికాసానికి అవసరమని పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, మతం తదితరాంశాలను ప్రాథమిక హక్కులుగా గుర్తించి వాటిని న్యాయ రక్షణకు అర్హమైనవిగా గుర్తించడం జరిగింది. ఉచిత ప్రాథమిక విద్య, పనిహక్కు, ప్రజారోగ్యం తదితర హక్కులను ఆదేశసూత్రాలు (Directive Principles) గా పేర్కొని న్యాయస్తానాలు అమలు పరచలేని హక్కులుగా గుర్తించారు. సామాజిక వికాసానికి అనేక రకాల హక్కులు అవసరమని కొంతమంది రాజ్యాంగ సభ సభ్యులు భావించారు. అయినప్పటికీ కొంత తర్జనభర్జనల అనంతరం ఈ హక్కులను ప్రాథమిక హక్కులుగా, ఆదేశ ( లేదా నిర్దేశిక ) సూత్రాలగా ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది.
ప్రాథమిక హక్కుల లక్షణాలు
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల లక్షణాలను పరిశీలిద్దాం.
( ఎ ) “పౌరులు”, “వ్యక్తులు” అనే రెండు పదాలను ప్రాథమిక హక్కుల అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. కొన్ని హక్కులు దేశంలోని వ్యక్తులందరికీ చెందుతాయని ప్రస్థావించడం జరిగింది. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశం, భావస్వాతంత్రం, మైనారిటీలకు విద్యా, సాంస్కృతిక హక్కులు మొదలైనవి పౌరులకు చెందుతాయని ప్రస్తావించడం జరిగింది. చట్టం దృష్టిలో సమానత్వం, మత స్వాతంత్రపు హక్కు వ్యక్తులందరికీ చెందుతాయని ప్రస్థావించడం జరిగింది.
( బి ) ప్రాథమిక హక్కులను రెండు భాగాలుగా గుర్తించవచ్చు. కొన్ని హక్కులు నకరాత్మక ( Negative ) నిబంధనలుకాగా, మరికొన్ని సకారాత్మక ( Positive ) ఆదేశాలుగా కనిపిస్తాయి. వీటి మధ్య భావరీత్యా ఎంతో తేడా లేకపోయినప్పటికీ భాషాపరంగా దీనిని గుర్తించవచ్చు. ఉదాహరణకు సమానత్వ హక్కులో 14వ ప్రకరణ “ రాజ్యం ఏ వ్యక్తికీ సమానరక్షణ ఇవ్వడంలో విచక్షణ చూపరాదు ” అని పేర్కొంది. కానీ స్వేచ్ఛా హక్కులో 19(1)వ ప్రకరణలో వివిధ స్వేచ్ఛలు పౌరులకు “ఉంటాయి” అని పేర్కొనడం జరిగింది.
( సి ) ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు. రాజ్యం వాటిపై సహేతుకమైన నిబంధనలను విధించవచ్చు. మారుతున్న పరిస్థితులను బట్టి ఈ హక్కులపై పరిమితులు విధిస్తూ పార్లమెంట్ చట్టాలను చేయవచ్చు. జాతీయ సమగ్రతకోసం, పరిపాలనా సౌలభ్యంకోసం పరిమితమైన హక్కులను సైనికులకు, పోలీసులకు కలిగించే అధికారం రాజ్యానికి ఉంది. జీవించేహక్కు, స్వేచ్ఛాహక్కు తప్ప ఇతర ప్రాథమిక హక్కులను జాతీయ అత్యవసర పరిస్థితిలో రద్దుచేయవచ్చు.
( డి ) ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అయితే హక్కుల ప్రాధాన్యతలో తేడాలున్నాయి. 1967 గోలక్ నాథ్ కేసులో జస్టిస్ హిదాయతుల్లా ఆనాడు ఉన్న ఆస్థి హక్కును అత్యంత బలహీనమైన హక్కుగా పేర్కొన్నారు. సాధారణంగా అన్ని హక్కులకంటే వ్యక్తిగత హక్కుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది.
( ఇ ) ప్రాథమిక హక్కులు న్యాయరక్షణకు అర్హమైనవి ( Justiciable in nature ) వాటిని సంరక్షించే బాధ్యతను రాజ్యాంగం న్యాయ స్థానాలకు ఇచ్చింది. ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం పార్లమెంట్ కు ఉన్నప్పటికీ, ఆ పరిమితుల సహేతుకతను పరిశీలించే అధికారం న్యాయస్థానాలదే. అంతేకాక రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం ( Basic structure theory ) ఏర్పడిన తరువాత, ఆ సిద్ధాంతాన్ని అనుసరించి పార్లమెంట్ చేసే రాజ్యాంగ సవరణను కూడా పరిశీలించే అధికారం న్యాయస్థానాలకు ఉంది.
No comments:
Post a Comment